Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఇది నా మొదటి టెల్గూ ఫిల్మ్..." దీపావళి సినీ ఆవకాయ్ ప్రారంభం..!!

సాయి అచ్యుత్ చిన్నారి

, సోమవారం, 12 నవంబరు 2012 (23:02 IST)
WD
ఛ... వి.వి.వినాయక్ అలా చేసాడేంటయ్యా...!? సెకండాఫ్‌లో ఆ సీన్‌ని అలా తీసి ఉండకూడదు...'' 'ఈగ'ని రాజమౌళి మొత్తానికేదో గట్టెక్కించాడు గానీ.... నేనైతే ఇంకా పక్కగా తీసుండేవాణ్ణి... నా దగ్గర అద్భుతమైన లైనుంది... పధ్నాలుగున్నర కోట్లు బడ్జెట్..... అది గనుక థియేటర్లలో పడిందో.... బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే.. నో డౌట్''. ఫిలిమ్ నగర్ కలల కేంద్రమైన కృష్ణానగర్ టీ కొట్టు దగ్గర నిత్యం వినిపించే మాటలు ఇలాగే ఉంటాయి.

ఇక్కడ టీ తాగుతూ గంటల తరబడి సినిమాల గురించి చర్చించుకుంటారు... విశ్లేషిస్తారు.... కొన్నికోట్ల రూపాయలకు సంబంధించిన విషయాల్ని సునాయసంగా మాట్లాడుకున్న తర్వాత తాగిన టీకి ఇవ్వాల్సిన మూడు రూపాయల కోసం జేబులు తడుముకుంటారు. ఈ రోజుకి నువ్విచ్చేయ్ అంటే నువ్విచ్చేయ్ అని వంతులేసుకుని చివరికి టీ కొట్టువాణ్ణి బతిమాలి బాకీ పెడతారు.

ఇదంతా కొందరికి కొత్తగా అనిపించొచ్చు, కాని తెలిసిన వాళ్ళందరికిది సర్వసాధారణం. ఇక్కడ నిజమైన ప్రతిభ ఉండి అవకాశాలు రానివాళ్ళూ ఉన్నారు, అరకొర అవగాహనతో స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళూ ఉన్నారు. ఏ రోజుకైనా ఇండస్ట్రీని ఏలాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యం. వీళ్ళందరితో అదృష్టం ప్రతినిత్యం దోబూచులాడుతూ ఉంటుంది. వేలల్లో ఒకర్ని వరించే ఆ అదృష్టం ఏదో ఒక రోజున ఖచ్చితంగా మమ్మల్నే వరిస్తుందన్న బలమైన ఆశతో వీళ్ళు నిరంతరం విసుగు లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఒక్కసారి వీళ్ళ జీవితాలు సహనం అంచు నుంచి అసహనం వైపు చేరుకుంటూ ఉంటాయి. మనల్ని ఎవ్వరూ గుర్తించడం లేదనే నిరాశావాదం ఆవహిస్తుంది. చీకటిలో చిరుదీపం దొరికినా చాలనుకునే ఆలోచనలు కమ్ముకుంటాయి... ఫలితంగా ఏదరికి చేరతాయో తెలియని సినిమాలు మొదలవుతుంటాయి.

సినిమా ప్రారంభం అనగానే చుట్టూ పత్రికల వాళ్ళూ, టీవీ వాళ్ళూ, హంగామా.... అంతా చూసేసరికి ఇంచుమించు మన లక్ష్యానికి దగ్గర కాబోతున్నామనే ఆవేశం కట్టలు తెంచుకొని వీళ్ళతో ఎక్కువ మాట్లాడిస్తుంది.
రెడ్డిగారి టైటిళ్ల సైలెన్స్ వెనుక...
అనుకోకుండా ఓ జననేత కాలం చేసాడు. అతని పట్ల జనాల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుని, సినిమా స్టార్ట్ చేస్తే ఎక్కడో దగ్గర్నుంచి ఫండ్ వస్తుందనుకున్నారు చాలామంది. మొదలెట్టారు.. ప్చ్.. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు
webdunia


అద్భుతమైన సబ్జెక్టు కుదిరిందండి... ఇది తెలుగు సినిమా చరిత్రేకాదు... తమిళం, కన్నడం..... అసలు...ఇండియన్ స్క్రీన్‌ మీద ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదండి... అంటాడు కొత్తగా పరిచయం అవుతున్న డైరెక్టర్ ఒకలాంటి భావోద్వేగంతో.

"ఇది నా మొదటి టెల్గూ ఫిల్మ్... టామిల్‌లో ఓ మూవీ చేషాను.....ఇంకా రిలీజ్ ఆవ్లేదు.....
ఓ... సారీ... నాకు టెల్గూ కొంచెం కొంచమే వచ్షు" అంటుంది తెలుగును నరికేస్తూ... మన సినిమావాళ్ల భాషలో ముద్దుముద్దుగా హీరోయిన్.

నా...కూ ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. నాకు ఫస్ట్ ఫస్టే హీరోగా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌గార్కి, ప్రొడ్యూసర్‌గార్కి..... నా జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ దణ్ణాలు పెడతాడు హీరో.

ఫస్ట్ షెడ్యూలు టాకీ ఇరవై రెండున్నర రోజులండి. హైదరాబాద్, రాజమండ్రి, పడమటిలంకలో జరుపుకున్నాక, ఒకటిన్నర రోజులు బ్యాంకాక్‌లో షూటింగ్ ఉందండి. తర్వాత పాటల కోసం హాంకాంగ్, ఇటలీ వెళ్దామనుకుంటున్నామండి' అంటాడు నిర్మాత మధ్యమధ్యలో హీరోయిన్‌ని చూస్తూ... నవ్వుతూ...

ఇదంతా ఆరోజు టీవీల్లో, మరుసటి రోజు పత్రికల్లో కనిపిస్తుంటే యూనిట్ అంతా చూసి మురిసిపోతూ, వీలైతే బంధువులకి ఫోన్‌ చేసి చూడమని చెప్తూ, తమదైన వేరే ప్రపంచంలో విహరిస్తూ రెండురోజులు ఎవరూ సరిగ్గా నిద్రపోరు. తర్వాత ఆ సినిమా ఏవయ్యిందో ఎవరికి అర్ధం కాదు... ఇలాంటి టాలీవుడ్ బిహైండ్ స్క్రీన్ స్టోరీలు చాలానే ఉంటుంటాయి.

webdunia
WD
మన టాలీవుడ్లో సరాసరి రోజుకు రెండు సినిమాలు ఓపెనై వార్తల్లో సందడి చేస్తుంటాయి. అంటే సంవత్సరానికి వందల సినిమాలన్నమాట. కానీ మన థియేటర్లలో వారానికి ఒక్క సినిమా రిలీజ్ అవ్వడమే కష్టమవుతోంది. అది కూడా డబ్బింగ్ సినిమాలతో కలిపి. మరి మిగిలిన సినిమాలన్నీ ఏమవుతున్నట్టు...? హంగామా చేసి ప్రారంభించే సినిమాలన్నీ తెరకెక్కవా...? ఆగిపోతాయా...? అంటే... కొంతవరకూ అవుననే సమాధానం చెప్పాలి.

ప్రారంభించి ఆగిపోయే సినిమాలు కొన్నయితే, సగంలో ఆగిపోయే సినిమాలు మరికొన్ని. పూర్తయినా రిలీజ్‌కి నోచుకోనివి మరికొన్ని. కారణాలు అడిగితే సవాలక్ష ఉంటాయి. కాని అన్నింటికీ ప్రధాన కారణం ఒక్కటే అని చెప్పొచ్చు. అవగాహనా లోపం....

ఇల్లు కట్టి చూడు - పెళ్ళిచేసి చూడు- అనే మాటకంటే సినిమా తీసి చూడు అనేదే ఇక్కడ బరువైన మాటని చెప్పొచ్చు. ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఓ బడ్జెట్ ఉంటుంది. పెళ్ళి చేయడానికి ఓ బడ్జెట్ ఉంటుంది. సినిమా తీయడానికి కూడా ఓ బడ్జెట్ ఉంటుంది. ప్రతి పనికి లెక్కగట్టుకుని డబ్బు పట్టుకొని అడుగు ముందుకేసే జనం ఒక్క సనిమా విషయంలో మాత్రం రంగంలోకి దిగాక డబ్బు సమకూర్చుకుందామనుకునే వింత లెక్కల్లో ఉంటారు. ఇందులో కొందర్ని మినహాయించినా, ఎక్కువ శాతం మంది చిన్న నిర్మాతల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఏదోవిధంగా ప్రారంభించడం, తీరా దిగాక వాళ్ళ అంచనాలు తారుమారవడంలో పరిస్థితి అగమ్యగోచరమవుతుంది.

ఉదాహరణకి... అనుకోకుండా ఓ జననేత కాలం చేసాడు. అతని పట్ల జనాల్లో ఉన్న విపరీతమైన ఆదరణ, విశ్వాసాన్ని ఏదోవిధంగా క్యాష్ చేసుకోవాలనుకునే ఆలోచనలతో చాలామంది ఆయన కథని సినిమా తీయాలనుకొని బయల్దేరారు. సినిమా స్టార్ట్ చేస్తే ఏదోవిధంగా ఎక్కడో దగ్గర్నుంచి ఫండ్ తెచ్చేసి పూర్తి చేయొచ్చనేది వీరి ధీమా. అలా ప్రారంభించిన ఏ ఒక్క సినిమా పూర్తయ్యే భాగ్యానికి నోచుకోలేక పోయాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు కనిపిస్తుంటాయి.

ఫలానా ఉద్యమం గురించో, పుణ్యక్షేత్రం గురించో, వార్తల్లో ఉండే వ్యక్తుల్ని విమర్శిస్తూనో సినిమాలు ప్రారంభిస్తే ప్రాజెక్ట్‌కి హైప్ క్రియేట్ చేసి శాటిలైట్స్ రైట్స్ ద్వారానో, మరోవిధంగానో కొంత అమౌంట్ రాబట్టి సినిమాని పూర్తి చేద్దామనే వ్యక్తులు అడుగడుగునా ఉన్నారు. అయితే వాళ్ళని నమ్ముకొని తమకు లైఫ్ వస్తుందని ఆశలు పెంచుకున్న టెక్నీషియన్ల పరిస్థితి అయోమయానికి గురికాక తప్పట్లేదు.

అనుభవరాహిత్యంతో ఇలా చేస్తున్నారేమో అని అనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశ్రమలో అనుభవం ఉండి కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నవాళ్ళు అనేకం ఉన్నారు. ఈమధ్య నాకు పరిచయమున్న మిత్రుడొకరు ఓ చిన్న సినిమాని ఓ ఏరియాకి పంపిణీ చేసి ఓ కొద్దిపాటి చిన్న మొత్తం సంపాదించగలిగాడు. ఇంకేముంది ఆయన చాలా సంపాదించేసాడనుకొని ఆయన వెనకాల కథలు పట్టుకొని ప్రదక్షిణలు చేసేవాళ్ళు బయలుదేరారు. అలా డైరెక్షన్ అవకాశం కోసం వచ్చిన ఒకాయన, సార్.... నేను కూడా ఓ పది లక్షలు పెట్టుబడి పెడతాను, మీరు ఓ డబ్బై పెట్టండి మొత్తం ఎనభై లక్షల్లో సినిమా పూర్తి చేసేద్దాం అని ప్రపోజల్ పెట్టాడు. ఇంకేం ఓకే అనేసుకున్నారు.

డైరెక్టర్ ముందు పదిలక్షలు పెడితే తనకున్న పరిచయాలతో మిగిలిన మొత్తం బైట తేవచ్చనేది ప్రొడ్యూసర్ ఆలోచన. ప్రొడ్యూసర్ డెబ్బై పెడితే తను ఇవ్వాల్సిన 10 లక్షలు నెమ్మదిగా అప్పు పుట్టించొచ్చు అనేది డైరెక్టర్ ఆలోచన. తీరా మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చాక చిన్నపాటి అయోమయం. చేసేదేం లేక ఇద్దరూ సాహసానికి దిగారు. డైరెక్టర్ ఓ రెండు, ప్రొడ్యూసర్ ఓ ఐదులక్షలు ఖర్చుపెట్టి ఓ వారం షూటింగ్ చేసారు. తర్వాత ఒకరు పెడతారని మరొకరు ఎదురుచూస్తూ ప్రాజెక్ట్‌ని అర్ధాంతరంగా ఆపేసుకున్నారు. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి కూడా మనకి అపురూపంగానే కనిపిస్తుంది. అలాంటిది ఏడు లక్షలు అటుఇటు కాకుండా పోవడమనేది మామూలు విషయం కాదు. అది పిల్లల ఫిక్స్‌డ్ డిపాజిట్లు నుంచి తెచ్చిందయ్యుండొచ్చు, లేదా తలతాకట్టు పెట్టైనా తీసుకుని వచ్చినదై ఉండొచ్చు. సినిమా ప్రపంచంలో జరిగిన నష్టం ఎవరికి చెప్పలేం, చెప్పుకున్నా అర్ధంకాదు కూడా. ఇక్కడ వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది.

ఆశలు ఆకాశంలో ఉండొచ్చు కాని ఆచరణలో పెట్టేటప్పుడు అడుగు నేలపైనే వేయాలి. లేకపోతే జీవిత స్వరూపమే మారిపోతుంది. ఇక్కడ ఇలాంటి కథలు ఎన్నో. సినిమా రంగంలోకి అడుగు పెడదామనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇవి గుణపాఠాలు కావాలి. అందుకే ఇలాంటివెన్నో ఈ దీపావళి పండుగ నుంచి తెలుసుకుంటూ చీకటి నుంచి వెలుగుల్లోకి మన కొత్త డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్లాలని ఆకాంక్షిస్తూ మీ సినీ ఆవకాయ్ ప్రారంభం. మరి మీ అభిప్రాయాలు రాస్తారు కదూ...!!

Share this Story:

Follow Webdunia telugu