Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతోషం సగం బలం... హాయిగా నవ్వమ్మా...

సంతోషం సగం బలం... హాయిగా నవ్వమ్మా...

WD

, శుక్రవారం, 7 మార్చి 2008 (17:30 IST)
మారుతున్న కాలమాన పరిస్థితులను అనుసరించి కుటుంబ భారాన్ని పంచుకుని, సాధికారతను సాధించుకునే క్రమంలో మహిళలు ఉద్యోగాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో గృహిణిగా, ఉద్యోగినిగా ద్విపాత్రాభినయం చేస్తూ, ఇంటా బయటా స్త్రీ పడుతున్న మానసిక సంఘర్షణను ప్రత్యక్షంగా చూసిన ఒక ఉద్యోగిని అనుభవాలను వెబ్‌దునియా వీక్షకులకు అందిస్తున్నాం.

చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక కంపెనీలో ఉద్యోగం లభించింది. మా కార్య బృందానికి మేనేజర్‌గా ఒక మహిళ నియమితులయ్యారు. మా బృందంలో అధిక సంఖ్యలో మహిళలు పని చేస్తుండేవారు. గాజు తలుపు గల ఒక ఛాంబర్‌ను నాకు కేటాయించారు. లంచ్ సమయంలో పక్కనే ఉన్న హాల్లో మా బృందంలోని మహిళా సభ్యులు భోజనాలు కానిస్తుండేవారు. ఆ సమయంలో వాళ్ల సంభాషణలు నాకు వినిపిస్తుండేవి. భర్త, అత్తగారు, ఆడపడుచు, ఇంట్లో సమస్యలు ప్రధానంగా వాళ్లు మాట్లాడుకునేవారు. నా భర్త, అత్తగారు నాకు పూర్తిగా సహకరించరని సునీత వాపోతే, భర్త వదిలేయడంతో మాతోపాటు ఉంటున్న మా ఆడపడుచు నేను ఉద్యోగం చేయడాన్ని చూసి ఓర్వలేకపోతోందని రాధ చెప్పుకునేది.

అందర్లోకి తక్కువగా మాట్లాడే పద్మ తన కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్తుండేది. తన భర్త, అత్తమామలు, ఆడపడుచులతో సుఖసంతోషాలతో ఉంటున్నట్లు చెప్తుండేది. ఉద్యోగాలు చేసే వివాహితలు అటు ఉద్యోగాన్ని, ఇటు ఇంటిని చక్కదిద్దుకోవడంలో భర్త, అత్తగార్ల సహాయ నిరాకరణను గురించి చెప్పుకోవడం సహజంగా వినిపించేదే. అయితే తన పిల్లలు హోమ్‌వర్క్‌ను పూర్తి చేయడంలో మామగారు అందించే సహకారాన్ని తోటి ఉద్యోగినులతో పంచుకుంటున్నప్పుడు పద్మ కళ్లలో కొత్త వెలుగు కనిపించేది. వంటింట్లో చేదోడు వాదోడుగా తన శ్రీవారు నిలుస్తారని అంతే ఆనందంతో వెల్లడించేది.

ఇక సునీత భర్తకు ముక్కు మీద కోపం. చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన సునీత మీద అంతెత్తున ఒంటికాలి మీద లేస్తుంటారు. కానీ తన భర్తకు భయపడి సునీత తన ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతోందని పద్మ నాతో అంటుండేది. ఒక రోజు పద్మ గులాబీ రంగుతో మెరిసిపోతున్న చీర కట్టుకుని ఆఫీసుకు వచ్చింది. పద్మ చీర మాకందరికీ భలే నచ్చేసింది. మేము అడిగిన మీదట ఈరోజు తన పుట్టినరోజని, ఈ చీర తన భర్త పుట్టిన రోజు కానుకగా ఇచ్చారని సిగ్గుపడుతూ చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో ఒకరికొకరం బహుమతులు ఇచ్చుకుంటామని తన కుటుంబాన్ని గురించి ఘనంగా చెప్పుకుంది. పద్మను మించిన అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరని నాకు అనిపించింది. ఇంకా చెప్పాలంటే పద్మ భాగ్యాన్ని ప్రపంచంలోని ఎనిమిదవ వింతగా చెప్పుకోవచ్చు. అడపా దడపా కవితలు రాసే సునీత, పద్మ కుటుంబాన్ని చంద్రుని కన్నా స్వచ్ఛమైందిగా పేర్కొంది. అంతేనా... చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ పద్మ కుటుంబంలో లోపాలు మచ్చుకైనా కనిపించవని కవితాత్మకంగా అంటుండేది.

అలా రోజులు ఆనందంగా గడిచిపోతుండగా కాలానుగుణంగా సంభవించిన మార్పులతో ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. చాలా రోజుల తరువాత పద్మ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అత్యవసరంగా నన్ను కలవాలని చెప్పింది. ఆమె గొంతులో నేపథ్యంగా విషాదం తొంగి చూడటాన్ని గమనించాను. సరే లంచ్ అవర్లో వస్తే మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇల్లాలిగా, గృహిణిగా పద్మ మాటల ద్వారా తెలుసుకున్న విషయాలు ఒక్కసారిగా నాకు గుర్తుకు వచ్చాయి. కరెక్టుగా లంచ్ టైమ్‌కు వచ్చింది పద్మ. ఆమెను చూసి ఖంగు తిన్నాను. లోతుకు పోయిన కళ్లు గాజు గోళాల్లాగా ఉన్నాయి. జుట్టంతా నెరిసిపోయి ఉంది. ముసలితనం ముందుగా ముంచుకువచ్చినట్లుగా ఉంది ఆమె అవతారం. అప్పట్లో ఆఫీసులో గడిపిన రోజులు గుర్తు చేసుకున్నాం.

బాధ్యతలు పెరిగిపోవడంతో సునీత తన కుటుంబ సభ్యుల సహాయ నిరాకరణను పెద్దగా పట్టించుకోవడం లేదని, అదేసమయంలో ఆమె ఇబ్బందులను గుర్తించిన భర్త, అత్తమామలు సునీతకు సహకరించడం ప్రారంభించారని పద్మ ద్వారా తెలుసుకుని సంతోషించాను. ఆడపడుచును ఆమె భర్త చేరదీసి తనతో కూడా తీసుకు వెళ్లడంతో రాధను చూసి ఈర్ష్య పడేవారు కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో ఆమె ఎలాంటి అసంతృప్తి లేకుండా ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తోందని నేన్ను విన్న సంగతిని పద్మతో పంచుకున్నాను. ఒక్కసారిగా మా మధ్య మాటలు ఆగిపోయాయి. "మేడమ్, నేను సైక్రియాటిస్టును కలుద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది...", అసలు విషయంలోకి నేరుగా వచ్చేసింది పద్మ. నేను ఏమీ మాట్లాడలేదు. పద్మ తన సంభాషణను కొనసాగించింది.

" మా కుటుంబం గురించి నేను మీ అందరికీ చెప్పిన సంగతులన్నీ నా మనోకల్పితాలు. ఇంటిగుట్టు రచ్చకు ఈడ్చవద్దంటూ నా పెళ్లి తరువాత అప్పగింతల సమయంలో మా అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి ఇంట్లో నా పరిస్థితిని మీకెవ్వరికీ చెప్పుకోలేదు. మన బాధను దగ్గరివారితో పంచుకుంటే సగం బాధ తీరుతుందనే భావనతో మీ దగ్గరకు వచ్చాను", ఒక్కసారిగా ఏడ్వటం ప్రారంభించింది. పద్మ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. మరో చేతిని ఆమె భుజంపై వేశాను అనునయిస్తున్నట్లుగా...

గుండె గదుల్లో దాచుకున్న బాధల కాలుష్యం కన్నీటి సంద్రంలో కొట్టుకు పోతున్నదేమో... ఏడుపులోనే ఉపశమనాన్ని పొందుతున్న తీరుగా పద్మ దు:ఖ తీవ్రత తగ్గు ముఖం పట్టసాగింది. నేను చెప్పడం ప్రారంభించాను, " ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. అయితే బాధల తీవ్రత ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఉంటుంది. మనకన్నా ఎక్కువ బాధలు పడేవారితో మనలను పోల్చుకోవడం ద్వారా కొంత మేరకు మన కష్టాలను మర్చిపోవచ్చు. తద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏదీ ఆయాచితంగా లభించదు. నెమలి నాట్యం చేసేటప్పుడు సౌందర్యం పురివిప్పుతుంది. కానీ పాట పాడటం నెమలికి చేతకాని పని. కోయిల నలుపే అయినా దాని స్వరం కమ్మగా ఉంటుంది. కానీ కోయిల ఎప్పటికీ నాట్యం చేయలేదు. పాడే ప్రయత్నాన్ని నెమలి ఒక్కనాటికి చేయదు. ఎల్లప్పడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా మన తప్పులు, మనపట్ల జరిగే అన్యాయాలపై మానసిక విజయాన్ని సాధించవచ్చు." నా మాటలతో జీవితంపై కొత్త ఆశ ఉద్భవించిందేమో అన్నట్లుగా... పద్మ ముఖంలో నూతనోత్తేజం క్రమక్రమంగా విస్తరించడం మొదలైంది.

Share this Story:

Follow Webdunia telugu