Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంబరాలతోనే సరిపుచ్చుకుందామా?!

సంబరాలతోనే సరిపుచ్చుకుందామా?!

WD

, శుక్రవారం, 7 మార్చి 2008 (19:14 IST)
అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా... ఇప్పటికీ కన్నుల ముందు కదలాడుతోంది. అప్పటి ముచ్చట... ఆరోజు మహిళలంతా ఒక చోట చేరారు. ఒకరినొకరు కలుసుకోవడం, కూర్చుని నింపాదిగా కబుర్లు చెప్పుకోవడంతో రోజంతా గడచిపోయింది. సాయంకాలమైంది. సంబరం ముగిసింది. ఎవ్వరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయి యధావిధిగా తమ పనుల్లో మునిగిపోయారు. వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఇంతకన్నా భారీగా, ఘనంగా జరుపుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆరోజు ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

వయోభేదం లేకుండా మహిళలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభోగంగా జరుపుకునేందుకు ఉపక్రమించారు. షిఫాన్, సిల్క్ చీరెలు ధరించి ఫారిన్ సెంట్ గుభాళింపుల మధ్య తమ స్థూలకాయాన్ని నెమ్మదిగా కదిలిస్తూ సభా కార్యక్రమం జరిగే స్థలం వద్దకు చేరుకున్నారు కొందరు మహిళలు. వచ్చిన వాళ్ల వైపు వింతగా చూస్తూ, తమను అక్కడికి ఎందుకు తరలించారో తెలియక బిత్తర చూపులతో
కొందరు గిరిజన మహిళలు నిలబడి ఉన్నారు. మిగిలిన తతంగం ఇతర సభల్లో జరిగినట్లుగానే షరామాములుగా సాగింది. ఉపన్యాసాలు, సన్మానాలు, నినాదాలతో కార్యక్రమం ఊపందుకుంది.

సమోసాలు, చిప్స్, కేకులు సభకు వచ్చిన వారికి పంచిపెట్టారు. చిప్స్ కరకరలాడుతుండగా 'సమాజానికి మహిళలు అద్దం వంటి వారు', 'మహిళా సాధికారత మా లక్ష్యం...' తదితర నినాదాలు, నినాదాలు చేస్తున్న వారి పెదవులపై వేసుకున్న లిప్‌స్టిక్‌కు ధీటుగా వెలిగిపోతుంటాయి. ప్రతి సంస్థ కూడా మరో సంస్థకు చెందినవారిని శాలువాతో సత్కరిస్తుంది. పురస్కారాలను ప్రధానం చేస్తుంది. అలా ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం చాలా సేపు కొనసాగుతుంది. ఇక మరునాడు కూడా ఉత్సవ వాతావరణం ఏ మాత్రం తగ్గదు. అన్ని పత్రికలూ పోటాపోటీగా మహిళా దినోత్సవ ఉత్సవాలను ప్రముఖంగా ప్రచురిస్తాయి.

మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎందుకు జరుపుకుంటున్నాం? అనే సంగతులు కార్యక్రమ నిర్వాహకులతో పాటు ఉత్సవంలో పాల్గొని ప్రసంగించేవారికి సైతం ఏ మేరకు తెలుసనేది సందేహామే. అందరికీ తెలిసిందే ఒక్కటే... మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. మార్చి ఎనిమిదవతేదీ మిగతా రోజుల లాంటిదే. కాకపోతే ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు నిద్రపోయే మేడమ్ గారు మార్చి ఎనిమిదవతేదీ ఉదయం ఆరుగంటలకే రెడీ అయిపోయి ఉత్సవ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునేందుకు బయలుదేరుతారు. వాతావరణంలోనే కాస్తంత మార్పు తొంగిచూస్తుంది.

కానీ ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన కమల రోజు లాగానే ఇవాళ కూడా పాత్రలను శుభ్రం చేసేందుకు ఉపక్రమిస్తుంది. ఎప్పటిలాగానే మల్లేశు పూటుగా మందు బిగించి తన భార్య మల్లిని చావబాదుతుంటాడు. మార్చి ఎనిమిది వస్తుంది... పోతుంది. మార్చి ఎనిమిదవ తేదీ ఏ వర్గానికి చెందిన నారీజనానికి అవసరమో వారికి ఆ రోజు పెద్దగా పట్టింపులోకి రాదు. ఎందుకంటే సంవత్సరంలో మిగిలిన 364 రోజుల్లాగానే ఈ రోజు కూడా వారి జీవితాల్లోకి ఇలా తొంగి చూసి అలా వెళ్లిపోతుంది కాబట్టి.

ఇలాంటి దినోత్సవం వలన చేకూరే ప్రయోజనం ఏమిటనేది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మహిళా దినోత్సవాన్ని వేదికగా చేసుకుని మార్పును ఆశిస్తూ కొందరు చేసే నినాదాలు చెవిటి వాని ముందు శంఖాన్ని ఊదిన వైనాన్ని గుర్తు చేస్తుంది. మహిళా దినోత్సవం కారణంగా కొందరి వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమవుతాయి. నిజమైన బాధితులకు ఆసరాగా నిలిచేందుకు మనం మార్చి ఎనిమిదవతేదీ వరకు ఆగవలసిన పనిలేదు. ఆ పనిని మనం ఈ రోజు నుంచే మొదలు పెడదాం...

Share this Story:

Follow Webdunia telugu