Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజ, దీక్షా సేథ్ 'నిప్పు'.. "ష్ష్ అబ్బ.. కాల్లేదు.. బూడిదైంది"

రవితేజ, దీక్షా సేథ్ 'నిప్పు'..
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2012 (15:48 IST)
నటీనటులు: రవితేజ, దీక్షాసేథ్‌, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌, ముఖుల్‌దేవ్‌, సుప్రీత్‌, ప్రదీప్‌రావత్‌, మాస్టర్‌ భరత్‌తదితరులు; కెమేరా: సర్వేష్‌ మురారి, మాటలు: ఆకుల శివ, శ్రీధర్‌, సంగీతం: తమన్‌, నిర్మాత: వైవిఎస్‌ చౌదరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్‌

విడుదల: 17.2.2012 శుక్రవారం.

సినిమాలు మూడు రకరాలుగా తీయవచ్చంటారు పెద్దలు. ప్రజలనాడి తెలిసి దాన్ని క్యాష్‌ చేసుకోవడానికి సినిమాలు తీసేవారు కొందరు. తమ కోసమే సినిమాలు చేసేవారు కొందరైతే... తన చుట్టుప్రక్కలవాళ్ల కోసం సినిమా చేసేవాళ్లు మరికొందరు. 'నిప్పు' సినిమా సరిగ్గా మూడవ తరగతికి చెందినదని చెప్పొచ్చు. ఒకప్పటి స్నేహితులుగా ఉన్న గుణశేఖర్‌, వైవిఎస్‌ చౌదరి, రవితేజ కలిసి తమ కోసమే సినిమా తీశారు. ఈ సినిమా వల్ల కొంతమందికి పని కల్పించారు. రవితేజ సినిమాలంటే మాస్ క్యారెక్టర్‌, కామెడీ, యాక్షన్‌ అంశాలుంటాయి. ఇవన్నీ మరొకసారి కలిపి తీస్తే ఎలా ఉంటుందనేందుకు ఉదాహరణ ఈ సినిమా. కానీ కథలో కొత్తదనం లోపించడమే ఈ సినిమాలోని ప్రత్యేకత.

సూరి(రవితేజ)కి నా అనేవారు ఎవ్వరూ లేరు. ఒక్క స్నేహితుడు శ్రీరామ్‌(శ్రీకాంత్‌). శ్రీరామ్‌ సౌదీలో ఉద్యోగం చేస్తూ తన తండ్రి మూర్తి(రాజేంద్రప్రసాద్‌)కి డబ్బులు పంపిస్తుంటారు. శ్రీరామ్‌కు ముగ్గురు చెల్లెళ్లు. అందులో ఒకరు మేఘన(దీక్షాసేథ్‌). ఆమె స్పింటర్‌.. పరుగుపందెంలో తనకంటూ ఓ గోల్‌ పెట్టుకుంటుంది. మూర్తి తన ముగ్గురు కుమార్తెల పెండ్లిండ్లి చేయాలనేది గోల్‌. శ్రీరామ్‌ పుట్టినరోజునాడు సూర్య సౌదీ వెళతాడు. కానీ తిరిగి ఒక్కడే వస్తాడు. తను చాలా బిజీగా ఉన్నాడని అతని తల్లిదండ్రులకు చెబుతాడు.

ఓ సందర్భం చూసి మేఘనకు సూర్య అసలు విషయం చెబుతాడు. శ్రీరామ్‌ అనుకోకుండా తను ప్రేమించి పెండ్లిచేసుకోవాలనుకున్న వైష్ణవిని హత్య చేశాడనీ, దానికోసం సౌదీ కోర్టు ఉరిశిక్ష విధించింది. దాన్నుంచి బయటపడాలంటే... వైష్ణవి తల్లిదండ్రుల నుంచి క్షమాపణ లెటర్‌ తెస్తేసరి. దానికోసం మేఘనను తీసుకుని వైష్ణవి ఊరైన సూర్యపేట వెళతాడు. ఆమె తండ్రి రాజగౌడ్‌(ప్రదీప్‌ రావత్‌)ను షాక్‌కు గురవుతాడు. ఆల్‌రెడీ అంతకుముందు వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

మైనింగ్‌ మాఫియా రాజు రాజాగౌడ్‌. అలాంటి వ్యక్తి నుంచి క్షమాపణ లెటర్‌ తీసుకోవడం కష్టమని గ్రహిస్తాడు. కానీ, ఎక్కడో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ.. అతని ప్రత్యర్థి శంకర్‌ కాక (ముఖుల్‌ దేవ్‌)కు సూర్య సాయం చేయడమే... ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

రవితేజ నటన.. రొటీన్‌గానే.. ఎవర్నీ లెక్కచేయని తత్త్వం. ఎంత సీరియస్‌ ప్రాబ్లమ్‌ అయినా కూల్‌గా చేసేద్దామనే క్యారెక్టర్‌. కానీ ఇందులో కొత్తదనం కూడా ఏమీ లేదు. సహజంగా ఇలాంటి సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా అవకాశం ఉండదు. కానీ దీక్షాసేథ్‌కు కాస్తోకూస్తో నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో స్పింటర్‌గా పేరు తెచ్చుకోవడంపైనే ఆమ దృష్టి.

ఇక తన అన్నకు ఉరిశిక్ష పడిందని తెలుసుకున్నప్పుడు కాస్త నటనను బయటకు తెచ్చింది. రాజేంద్రప్రసాద్‌ హుందా గల తండ్రి పాత్రను పోషించాడు. వయస్సు పైపడి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే సన్నివేశంలో బాగా నటించాడు. ప్రదీప్‌ రావత్‌, ముఖుల్‌దేవ్‌ విలన్లుగా సరిపోయారు. కాస్తకూస్తో హాస్యంతోనే కథను రక్తికట్టించటానికి బ్రహ్మానందం చేత చేయించిన ప్రయత్నం ఎబ్బెట్టుగా ఉంది.

చిత్రంలో బాగుందన్నది ఏంటని అడిగితే... సర్వేష్‌ మురారి సినిమాటోగ్రఫీ మాత్రమే. ఆకుల శివ, శ్రీధర్‌ సంభాషణల్లో కొత్తదనం ఏమీ లేకపోగా, పంచ్‌ పేరుతో పలికిన కొన్ని డైలాగ్‌లు కూడా బలవంతంగా చెప్పించినట్లున్నాయి. తమన్‌ సంగీతం ఆకట్టుకునేట్లుగా ప్రయత్నించాడు. కానీ ఒకే ఒక్కపాట బాగుంది. నిర్మాణ విలువల్లో ఏమాత్రం రాజీపడకుండా వైవి.ఎస్‌. చౌదరి చేసిన ప్రయత్నంలో న్యాయముంది. కానీ కథను ఎంచుకున్న విధానంలో గమనాన్ని నడపడంలో గుణశేఖర్‌లో క్లారిటీ లేదు. అసలు కథలో చెప్పుకోదగ్గ ఇంట్రస్ట్‌ లేకుండా... నిర్మాతగా చిత్రాన్ని తీసినందుకు చౌదరికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

రవితేజ క్యారెక్టర్‌లో ఉన్న ఏరెగెంట్‌... ప్రతి సన్నివేశంలోనూ కన్పిస్తుంది. దానివల్ల సినిమాలో సీరియస్‌నెస్ లేదు. ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునేలా లేదు. స్క్రీన్‌ప్లేలో గుణశేఖర్‌ ఫెయిలయ్యాడు. చిత్రంలో భారీ తారాగణం, భారీ యాక్షన్‌ సన్నివేశాలు, బాంబ్‌ బ్లాస్ట్‌లు, కత్తులతో పోరాటాలు... ఇవన్నీ... బాలకృష్ణ సినిమాలను గుర్తు చేస్తాయి. ఒకనాడు బాలకృష్ణ రేంజ్‌లో 'వీర' అనే సినిమాను తీసి భంగపడ్డ రవితేజ 'నిప్పు'తో మరో ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. అసలు టైటిల్‌కు ఏమాత్రం సింక్‌ కానీ సినిమా ఇది. నిప్పు పట్టుకుని చేతులు కాల్చుకున్నారనే దానికంటే, ఈ నిప్పుతో చివరికి బూడిద మిగులుతుందనేది కరెక్టేమోననిపిస్తుంది. ఈ సినిమా ఎ- సెంటర్లో కష్టమే. బి,సి సెంటర్లలో చూస్తారో లేదో అనేది కొద్దిరోజులు ఆగితే కానీ చెప్పలేం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ "దమ్ము" చూపిస్తాడా!